Wednesday, October 31, 2007

సంగీత మేఘం


వయొలిన్ క్లాస్ కొసం అని హైదరబాద్ లొని Airlines కాలని లో ఒకళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను నేను, మా వయొలిన్ సార్ అక్కడే చెప్తుంటారు మాకు పాఠాలు, అక్కడికి వెళ్ళే ప్రతి సారి ఎదో అనిర్వచనీయమైన అనుభూతి...నాకు కలిగే ఆ అనుభూతి కి ఆ ఆనందనికి అక్షర రూపం ఇస్తే ..ఇలా ఉంటుందేమో .........

“రోడ్ మీద దిగి నడవటం మొదలు పెట్టగానే … నీట్ గా Straight గా ఒక తార్ రోడ్….రోడ్ కి రెండు వైపులా చెట్లు…చాలా పెద్దగా ఏండను కూడా లోపలకి రానీయకుండా విస్థారంగా పరుచుకున్న వాటి కొమ్మలు, ఎటు చూసినా శుభ్రంగా కనపడుతున్న రోడ్లు,గాలి కి ఆ కొమ్మలు అటు ఇటు తప్పుకోగానే, ఆ కొమ్మల మధ్యలో దూరేసి రోడ్ మీద పడుతున్న ఏండ……..

టైం పది కావస్తొంది, ప్రతి ఇంటి ముందు కాస్త చెరిగిన ముగ్గుల మీద గాలి కి అటు ఇటు ఊగుతున్న పున్నాగ పూల చెట్ల నుంచి రాలి ముగ్గుల మీద పడ్డ పున్నాగ పూలు....... వాటి వంటి మీద ఉన్న సువాసనలను నా దాకా మోసుకొస్తున్న గాలి, గుండెలనిండా గాలి పీల్చుకొని నడుస్థుంటే, ఎక్కడి నుంచో సన్నగా వినపడుతున్న ఎం.స్ సుబ్బలక్ష్మి భజగోవిందం, కూరగాయల బండి వాడితో బేరం ఆడుతూ రోడ్కి ఒకపక్కగా నిల్చున్న ఆడవాళ్ళు, రోడ్కి ఒక మూల గా చిన్న ఇస్త్రీ కొట్టు, రేడియో పెట్టుకొని , ఆ గాలి , ఆ సూరీడుతో పాటు తనుకూడా తన పని తాను చేసుకుంటున్న ఇస్త్రీవాడు, పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ పైనుంచి , ఇదిగో ధర్మారావు బట్టలు ఉన్నాయి వచ్చి తీసుకువెళ్ళు, సాయంత్రానికల్లా ఇస్త్రీ చెయ్యాలి, అయ్యగారు ఊరు వెల్లిపొతారు అంటూ అరుస్తున్న ఒక ఇంటావిడ,”ఆ వస్తానమ్మగారు, ఆ 502 వాళ్ళకి బట్టలిచ్చేసి మీ దగ్గరకే వస్తా” అంటూ ఆ ఇస్త్రీవాడి జవాబు.

కొంచం ముందుకు వెళ్ళగానే, ఆదివారం అనందం అంతా మొహల్లో నింపుకొని, ఆ స్కూల్ యునిఫారంస్ ని పక్కన పడేసి , రంగు రంగుల బట్టల్లో, బాట్ బాల్ పట్టుకొని క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు,రాళ్ళని వికెట్స్ గా సర్దుతున్న చిన్న అబ్బాయి……….

ఒక ఇంటి అరుగు ముందు బైకుల మీద గుంపు గా కుర్చొని కబుర్లు చెప్పుకుంటున్న అబ్బయిలు....... వీళ్ళని దాటుకుంటూ నడుస్తుంటే , ఆకలి వేస్తొందోచ్ అంటునట్టు అరుస్తున్న ఒక ఇంటి వారి పెంపుడు కుక్క పిల్ల, వీటన్నింటిని దాటుకుంటూ , గుండెలనిండా ఎదో అనందం నింపుకుంటూ నడుస్తుంటే, గట్టిగా చెవిలో ఎదో సవ్వడి చేస్తునట్టుగా వీచిన గాలి, వయొలిన్ పట్టుకున్న నా చేతికి చల్లగా ఎదో తగిలినట్టు అనిపించి చూస్తే, పైన ఉన్న చెట్టు నుంచి విడిపడి నా చేతి మీద నుంచి న వయొలిన్ మీద పడి నిలిచిన పసుపచ్చ పూవు.

ఇంతటి ఆహ్లదకరమైన వాతావరణం మధ్య మెల్లగా అడుగు పెట్టాను వయొలిన్ క్లాస్ జరిగే ఇంటిలో...... ఇంటిలోకి వెళ్ళగానే ఎదురుగా షోకేస్ లో కనపడ్డ బుల్లి వీణ, గదిలొ ఒక మూల గా చిన్న కొబ్బరి ఆకలుతో బుల్లి కొబ్బరి మొక్క, గాలి కి అటు ఇటు ఊగుతున్న పచ్చటి కర్టన్స్. వెళ్ళి కూర్చొగానే లొపల నుంచి "ఒం నమో నారాయణాయ అంటూ వినపడుతున్న నారయణ మంత్రం…………”

అలాంటి వాతావరణం లో సా రీ గా మా పా దా ని సా అంటోంది నా వయొలిన్, నా చేతిలో………………………
ఈ క్షణం ఇలానే నిలిచిపోతె బాగుండు అనిపిస్తుంది ఏ రొజుకారొజు