Tuesday, August 19, 2008

చిగురాకు

కు కు కు అంటూ కోకిలమ్మ పాట ఎక్కడ నుంచో సన్నగా వినిపిస్తుండగా...బద్దకం గా కళ్ళు తెరిచాను....
ఆ ముందు రాత్రే కొత్తగా ఆ ఇంట్లోకి దిగటం వల్ల సామాన్లు అన్నీ సర్దే హడావిడిలో ఇంటి చుట్టు పక్కల వాతావరణాన్ని కుడా తీక్షనంగా చూసింది లేదు....
రాత్రంతా పనితో అలిసిపోయి పడుకోవటం వల్ల కాబోలు నిద్ర త్వరగా పట్టింది
పొద్ధున్నే కాస్త బడలిక తగ్గినట్టు అనిపిస్తోంది ....
ఈ కొకిలమ్మ చిరునామ ఎక్కడో చుద్దాం అని బద్దకం గా దుప్పటి తీసి లేచి , కిటికీ దగ్గరకు వెళ్ళి చూసాను....
పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ మేడ కనపడుతోంది….
చుట్టూ ఎటు చూసినా పచ్చగా కనపడుతున్న చెట్లు...అప్పుదే ఆగిన వర్షం తాలుకా చాయలు రోడ్ అంతా నిండి ఉన్నాయి…
ఆ కనపడుతున్న చెట్ల మధ్యలో ఎదో చెట్టు చిటారుకొమ్మన నక్కి పాడుతోంది కోకిలమ్మ….
కాఫీ పెట్టుకోవటానికి వంటింట్లోకి వెళ్ళాను …అమ్మ ఉంటే ఈ చేతులు కాల్చుకునే బాధ తప్పుతుంది. అమ్మ నాన్నగారు
రావాటానికి ఇంకా నెల రోజులు పడుతుంది…. అమ్మ చేతి కాఫీ తాగలేకపోయానే అని భాధపడుతూ అలా వెళ్ళి ముందు గదిలో కూర్చున్నాను పేపర్ ముందేసుకొని…
కాస్తంత వేగం హెచ్చించి అరవటం మొదలుపెట్టింది కోయిల…. కోయిల గొంతుతో పాటు ఇంకేదో గొంతు వినపడ్డట్టు అనిపించి బెడ్రూంలొకి వెళ్ళాను…. పక్క అపార్ట్మెంట్స్ మేడ పైన నిల్చోని, తల ఎత్తి ఆ చెట్టు చిటారు కొమ్మ వైపే చూస్తూ…
నోటికి చేతులని అడ్డం పెట్టుకొని కోయిల కి పోటిగా తను కూడా కు కు అంటూ ఆ కొయిలని రెచ్చకొడుతూ కనపడ్డాడు ఒక
పిల్లాడు….
భహుసా ఏడేళ్ళు ఉండచ్చు… చక్కటి కను ముక్కు తీరు,ముద్దుగా ఉన్నాడు …
ఆమ్మమ్మా కోయిల చూడు ఎలా అరుస్తోందో నాతో పాటూ అంటూ అప్పుడే మేడ మెట్లు ఎక్కి వస్తున్న ఒక ముసలావిడ వైపు పరుగు పెట్టడు …
ఉండరా..అలా పరిగెత్తకు పడిపొతావ్ అంటూ ఆవిడ ఆ పిల్లాడి చేయి పట్టుకొని మేడ మీదకు నడిచింది
ఛేతిలోని కవర్లో నుంచి గింజలు తీసి మేడ మీద విసరటం ప్రారంభించింది…
ఆ చుట్టూరా ఉన్న చెట్ట్లన్నిటి మీద నిల్చొని, ఈ ముసలావిడ కోసమే ఎదురు చూస్తునట్టు గా ఉన్న పావురాలన్నీ..ఆ గింజలు వేసి ఆవిడ పైకి చుడగానే…సర్రున ఎగురుతూ వచ్చి అన్నీ ఒక్కసారిగా ఆవిడ కాళ్ళ ముందు వాలిపొయాయి….. ఆ గింజలు తింటున్న పావురాళ్ళ గుంపు ని చుపిస్తూ…
“అమ్మమ్మా వీటికెందుకు రోజు ఆం పెడుతున్నావ్ నువ్వు” అని అడిగాడు ఆ పిల్లాడు….
పొద్దున్నే ఇలా పైకి వచ్చి ఆ చెట్లని..వాటి మధ్య ఉన్న ఆ కొయిలమ్మ ని ఈ పావురాళ్ళని పలకరించాం అనుకో… రొజంతా బాగుంటుంది రా అంటూ వాడి తల నిమిరింది ఆవిడ…
మరి సుర్యుడిని కూడా చుడాలన్నావ్ గా అమ్మమ్మ అంటూ ఆవిడ చీర చెంగు పట్టుకొని అటు ఇటు గెంతటం మొదలుపెట్టాడు ఆ పిల్లాడు….
ఔను రా… సుర్యుడు మరి శక్తిని ఇచ్చే దేవుడు…అందుకే ఆయనకు కూడా రోజు పొద్దునే నమస్కారం పెట్టుకున్నావనుకో …అప్పుడు నీకు స్కూల్లో అన్ని పాటాలు వచ్చేసేలా దీవిస్తాడు….
సరే కాని ముందు నువ్వు నా చెంగు వదులు అంటూ చెంగు విదిలించింది ….
అంటే అమ్మమ్మ సుర్యుడు మనకి స్వామీ ఆ..హనుమంతుడి లాగా….
ఔను నాన్నా…సరే స్కూల్ కి ఆలస్యం అయిపొతుంది..పద స్నానం చేద్దువు అంటూ కిందకి తీసుకువెళ్ళిపొయింది….

*********************************************************************************

అప్పుడే రెండు రోజులు అయిపొయింది నేను ఆ కొత్త ఇంట్లోకి దిగి…
రోజు ఆఫీస్ కి వెళ్ళటం ఒక యుద్ధ కాండ అయిపొయింది… ఉరుకులు పరుగులు…అంత కన్నా ఇబ్బందికరమైన ట్రాఫిక్ …
ఈనాడు హిందూ డెక్కన్ క్రానికల్ ..ఈ మధ్య కొత్తగా వచ్చిన సాక్షి..అన్ని పత్రికలు చదవటం అయిపొతుంది ఆఫీస్ బస్ లోనే…..
ట్రాఫ్ఫిక్లో చిక్కుకుపొయి ఉన్న బస్ గురించి అందులో ఉండిపొయిన నా పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే…ఒక హెలికాఫ్టర్
కొనుక్కొవటం మంచిదేమో అని మెరుపు లాంటి అలొచన వచ్చింది ..
ఒక వైపు చిరాకు గా ఉంటే మళ్ళీ వెనక నుంచి హారెన్ ల మోత….సగం ఈ ప్రయాణం లోనే అలిసిపొతున్న నా ఈ దుస్థితిని తిట్టుకుంటూ కిటికి లో నుంచి తల పక్కకి తిప్పాను….
ఒక ఐదడుగుల దూరంలో ఆగి ఉన్న స్కూల్ బస్…నాకు సరిగ్గా పక్క గా ఉన్న కితికి పక్కనే కూర్చోని ఉన్నాడు పక్క అపార్ట్మెంట్స్ మేద పైన కనపడ్డ ఆ కొయిల పిల్లాడు….
ఎందుకో వాడిని చూడగానే అలసట మటుమాయమయైపొయింది…
హెల్లో అంటూ చేయి ఉపాను వాడికి కనపడేలా….
బదులు గా ..కాస్త భయం గా నా వైపు చూస్తూ తల దించెసుకున్నడు……ఒక్క నిమిషం ఆగి…మళ్ళీ తల ఎత్తి నా వైపు చుసాడు….నేను మళ్ళీ చేయి ఉపాను …ఈ సారి కాస్త చిరునవ్వు చిందించాడు…
తను కూడా ఛేయి ఊపటం మొదలు పెట్టాడు…..
ఎప్పుడూ జేబులో చాక్లట్స్ పెట్టుకొని తిరుగుతుండటం నా అలవాటు…. సిగరెట్స్ తాగే వయసు వచ్చినా చాక్లట్స్ ఏ తింటావేంటి రా ఇంకా అని ఎంత మంది స్నేహితులు వెక్కిరించినా…నా ఈ తీయని అలవాటు అయితే మానుకొలేకపొయాను…..
జేబులోనుంచి ఒక చాక్లట్ తీసి కిటికి లో నుంచి చేయి బైటకు చాపి ఆ పిల్లాడికి అందించే ప్రయత్నం చేసాను…. వెంటనే తన బుజ్జి బుజ్జి చేతులని కిటికి లో నుంచి బైటకు పెట్టి చాక్లట్ ను అందుకునేందుకు శతవిదాలా ప్రయత్నించాడు….. చాలా చిన్న చిన్న చేతులు అవ్వటం వల్ల అందుకోలేక పోతున్నాడు …..
వీలు అయినంత మేర నా చేయిని చాపి అందించే ప్రయత్నం చేస్తునే ఉన్నాను నేను..
ఈ లోపల ఎదో స్పురించినవాడిలా వెంటనే తల లోపలకి పెట్టేసుకొని బ్యాగ్ వెతికేసి ఒక స్కేల్ తీసాడు…
ఆ చెక్క స్కేల్ ని పట్టుకొని నా చేయి దాకా అందించకలిగాడు… చాక్లెట్ ని ఆ స్కేల్ అంచున ఉంచాను…
అతి జాగ్రత్త గా ఆ స్కేల్ వైపే చూస్థూ మెల్లగా స్కేల్ లోపలకి తీసుకున్నాడు….
ఇదంతా తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తున్న వాడి మిత్ర బృందం అంతా ఒక్క సారి గా చప్పట్లు చరుస్తూ అరిచారు…
ఎదో విజయం సాధించా అన్న గర్వం తో నా వైపు చూస్తూ మళ్ళీ చేయి ఉపాడు… బస్ కదిలివెళ్ళింది
********************************************************************************
శనివారం సాయంత్రం కాస్త గాలి పీల్చుకునేందుకు తీరిక దొరికే సమయం .. ఛేతిలో చందమామ పుస్తకంతో……అలా చల్లగాలికి పార్క్ దాకా నడుచుకుంటూ వెళ్ళా…..
జారుడుబండ… ఉయ్యాల…..
వాటి తో ఆడుకుంటూ… ప్రపంచాన్నే మర్చిపోతూన్న చిన్నారులు…
ఆ పసితనంలో ఉన్న అమాయకత్వం…. ఆ నవ్వుల్లో వినపడుతున్న స్వచ్చత .. మనసుకి ఎంతో హాయిని ఇస్తోంది…
ఆ పిల్లల గుంపులో కనపడ్డాడు ఆ కొయిల పిల్లాడు…
ఎర్రటి చొక్కా నల్ల నిక్కరు వేసుకొని జారుడుబండ మీద స్వైర్య విహారం చేస్తున్నాడు ……
ఫై నుంచి జారి కిందకు చేరగానే…. పెద్ద పెద్ద గా నవ్వుతున్నాడు ……
ఛాలా ముద్ధు గా అనిపిస్తున్న వాడి మొము ని చుస్తుంటే దగ్గరకు తీసుకొవాలనిపించింది…
వెంటనే వాడి కి సైగ చేసాను ఇటు రమ్మని…
రాను అనట్టు తల ఉపాడు…..
కాసేపు ఆగి మళ్ళీ తనే పరిగెత్తుకుంటూ వచ్చాడు
“నీ పేరు ఎంటి “ అన్నాను
రఘురాం అన్నాడు
వాడిని దగ్గరకు తీసుకుంటూ… రఘురాం అంటే ఎవరో తెలుసా అన్నాను ….
వెంటనే చేతులు రెండు దగ్గరకు తెచ్చేసుకొని “స్వామి” అంటూ నమస్కరించేసాడు
నేను కూడా స్వామి అంత మంచివాడిని అవ్వాలని మా అమ్మ పెట్టింది అట ఆ పేరు అన్నాడు
“నువ్వు ఏ క్లాస్ ??”
ఫస్ట్ క్లస్స్
మీ నాన్న ఏం చేస్తారు…
దేవుడి దగ్గర ఉన్నాడు అట, సైకిల్ వేసుకొని వస్తాడని మా అమ్మమ్మ చెప్పింది…కాని ఇప్పుడే రాడు అట, నేను బాగా చదువుకోని పెద్ద వాడిని అయ్యాక…అప్పుడు బోల్డన్ని చాక్లెట్స్ తీసుకొని వస్తాడట
ఏదొ తెలియని బాధ ఒక్క నిమిషం అలా గాలి లా తాకి వెళ్ళింది
వెంటనే.. మీ అమ్మ ఎక్కడ అని అడిగా
ఆమ్మ కూడా నాన్న దగ్గరే ఉంది అట…అమ్మమ్మ చెప్పింది… నేను అన్నం తినకపోతే అమ్మ ఎడుస్తుంది అట…అందుకని నేను ఆం తినేస్తాను రొజు అమ్మమ్మ పెట్టగానే
భగవంతుడా ఎంటి ఇది అని మనసులోనే ఆ జగన్నాటక సుత్రధారిని నిలతీసాను….
యధావిది గా సమధానం బదులుగా నిశబ్దం
వాడి తల మీద చేయి ఉంచి… రఘు మీ అమ్మమ్మ రాలేదా నీతో అని అన్నాను…
లేదు.. అమ్మమ్మ ఇంట్లో పడుకుంది…అమ్మమ్మ కి అబ్బు వచ్చింది కదా మరి…
అందుకని సుబ్రమణ్యం ని తోడు గా ఉంచి నేను ఒక్కడినే ఆడుకోవటానికి వచ్చాను అన్నాడు
ఎందుకొ మనసు కీడు శంకించింది…. వెంటనే రఘు చేయి పట్టుకొని… మీ ఇంటికి తీసుకెళ్ళు నన్ను అన్నాను….
ఎందుకు అంకుల్… అన్నాడు…
ముందు తీసుకెళ్ళు అని చెప్పా
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాము…
కాలింగ్ బెల్ కొట్టాను…. తలుపు తీసే ఉంది రా రా అంటూ వినపడింది ఆవిడ గొంతు
తలుపు తీసి లొపలకి వెళ్ళాను…
ఒక్కరే మంచం మీద పడుకొని ఉన్నారు…… నన్ను చుడగానే అరుస్తూ మీదకు వచ్చింధి ఒక కుక్క….
ఒక్క ఉదుటున గది బైటకి దూకాను…
పర్లేదులే బాబూ ఎం అనదు….. రఘు ..ఈ సుబ్రమణ్యం గాడిని బైట కట్టెసి రా అంటూ రఘు చేతికి ఆ కుక్క చైన్ అందించారు ఆవిడ
అప్పటికి కాని నా ప్రాణం కుదుట పడలేదు…
ఇంతకీ సుబ్రమణ్యం అంటే ఈ కుక్క నా…. దీన్నా తోదుగా పెట్టి వచ్చా అని చెప్పాడు రఘు
మెల్లగా వెళ్ళి ఆవిడ మంచం పక్కన కూర్చున్నాను ….
నమస్కారం అండి.. నా పేరు కార్తీక్ .. మీ పక్కన అపర్ట్మేంట్స్ లో ఫొర్థ్ ఫ్లొర్లో ఈ మధ్యనే కొత్తగా దిగాము
ప్రతి రోజు మిమ్మల్ని రఘు ని మేడ మీద చుస్తుంటాను….
మీకు వంట్లో బాగుండలేదు అని తెలిసి పలకరిద్దాం అని వచ్చాను అని ముగించాను
ఆవిడ నా వైపు చూస్తూ నవ్వుతూ ….. మంచిది బాబు.. ఏం చేస్తుంటావు అని అడిగారు
నేను మెకానికల్ ఇంజినీర్ ని అండి…అని చెప్పాను
సంతోహం నాయనా … మా రఘు ని కూడా ఇంజినీర్ ని చెయ్యలని నా ఆశ..
వాళ్ళ అమ్మ ఆశ కుడా అనుకో…
మా అబ్బాయి కూడా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసాడు….. ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తుండాగానే పోయాడు .. అంటూ తల దించుకున్నారు
ఎమని చెప్పి ఓదార్చలో అర్ధం కాలేదు నాకు
వెంటనే ఆవిడ చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ… అదే ఆక్సిడెంట్లో రఘు అమ్మ నాన్న కూడా పొయారు
కూతురు అల్లుడు కొడుకు ముగ్గురు ఒకే సారి నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపొయారు బాబు
ఏ ముసలిది ఒంటరి గా ఏలా ఉంటుందో అని ఒక్క నిమిషం అన్న అలొచించలేదు ఆ పై వాడు
ఇదంతా జరిగి ఐదేళ్ళు అయినా కూడా నాకు ప్రతీ రోజు నిన్నే జరిగినంత బాధ…
అంతా తల రాత అంటూ ఉబికివస్తున్న కన్నీరు ని ఆపే ప్రయత్నం చేస్తు లేచి కూర్చున్నారు
పడిపోబోతున్న ఆవిడ ని రెండు చేతులతో పట్టి లేచి కూర్చోబెట్టా
మీ అరోగ్యానికి ఎమైంది అండి అసలు అని అడిగాను
ఏముంది బాబు… వార్ధక్యం కదా…సహజం గా వచ్చే నీరసం ఆయాసం షుగర్ బీ పీ అన్ని ఉన్నాయిలే
అవే ఇలా అప్పుడప్పుడు దాడి చేస్తుంటాయి
అన్నిటికి మించి అప్పుడప్పుడు గుండెల్లో కల్లుక్కు మని అనిపిస్తూ ఉంటుంది అన్నారు
అయ్యో మరి డాక్టర్ కి చూపించుకోవాల్సింది కదండి అన్నాను ఆవిడకు మంచి నీళ్ళు అందిస్తూ…
ఆ మందులు ఉన్నాయి కదా అని ఊరుకున్నానులే…
అయినా ఒక్క దాన్నే వెళ్ళలేక ఆగాను బాబు అన్నారు
అదేంటి అండి ..చుట్టాలు ఎవరు లేరా..కనీసం ఎప్పుడో ఒక సారి వచ్చి సాయపడటానికి అని అడిగాను
లేకేం ఉన్నారు.. కాని ఏ ఏండ కి ఆ గొడుగు పట్టే రకాలు… మా రఘు ని పెంచుకుంటాం అని కూడా ముందుకు వచ్చారు మొదట్లో… వాడి మీద ప్రేమతో అనుకునేవు… వాడి డబ్బు మీద వ్యామోహంతో
నా కొడుకు …అల్లుడు ఇద్దరి ఆస్తికి వాడే వారసుడు ….
మూడు నెలల క్రితం దాకా కూడా బాగా వచ్చి పొయేవారు…
మా అబ్బాయి మా అల్లుడు కలిసి చేసిన వ్యాపారం కోసం అని ఎక్కడో పెద్ద మొత్తంలో అప్పు చేసారు.. ఆ అప్పు కింద …ఉన్న ఆ కాస్త ఆస్తి స్వాధీనం చేసుకున్నారు కొర్ట్ వాళ్ళు…
గతి లేక ఈ అపార్ట్మెంట్స్ లోకి వచ్చాము అద్దెకు…
మా వారి పేర ప్రతి నెల గవర్నమెంట్ వారు పంపే పెన్షన్ తోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నాను
ఇదంతా జరిగాక… ఆ చుట్టాలు కనపడలేదు
ఏక్కడ ఆదుకొమంటానో అని ఎవరి దారి వారు చుసుకున్నారు
అయినా నా గురించి నాకేమి భయం లేదు…. కాని నేను పోతే రఘు అనాధ అశ్రమానికి వెళ్ళాలి…
అదే నా దిగులంతా….. ఆ వచ్చే పెన్షన్ కూడా రాదు ఇక
ఏం చేస్తాం.. అంతా ఈస్వరేచ్చ…..
అల్లారు ముద్దు గా చుసుకునేది వాడిని వాళ్ళ అమ్మ….
నెలల పిల్లాడి గా ఉనప్పుడు అయితే ఎవరిని తాకనిచ్చేది కూడా కాదు
ఏ లొకాన ఉందో కాని…. వాడిని రేపు అష్రమానికి పంపితే దాని ఆత్మ ఎంత గా బాధపడుతుందో అంటూ పెద్దగా ఎడ్చేసారు ఆవిడ…
వెంటనే దగ్గరకు వెళ్ళి ఆవిడను పట్టుకున్నాను….నన్ను అల్లుకొని ఎడ్చేసారు తనివి తీరా
వార్ధక్యం ఒక శాపం అనుకుంటే….ఆ శాపానికి తోడు ఈ బరువు
********************************************************************************
అఫీస్ నుంచి రాగానే రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళిపొవటం అలవాటు అయిపొయింది…
ఆవిడ కి మందులు వేయటం , వాడికి హొమెవర్క్ చేయించటం , ముగ్గురం కలిసి భొజనం చేయటం….
హార్ట్ స్పెషలిస్ట్ కి చూపించాను..ఇప్పుడు ఆరొగ్యం కాస్త కుదుటపడింది
రఘుతో నా అనుబంధం మరింత బలపడింది
ఛిగురాకు అంతటి స్వచ్చత ఉన్న పసి వాళ్ళ మనసులు చాలా త్వరగా అల్లుకుపొతాయి….
రొజు ఎలా గడిచిపొతోందో తెలియనే లేదు…..
ఆమ్మమ్మ గారికి దగ్గు బాగ పెరిగిపొవటం చేత…వాళ్ళింట్లోనే పడుకోవాలని నిర్ణయించుకున్నాను….
ఛల్ల గాలికి కాసేపు,మేడ మీద చాప వేసుకోని పడుకున్నాను…
అంకుల్ కద చెప్పవా అంటూ నా పక్కకు చేరాడు రఘు….
ఛందమామ పుస్తకం పక్కన పెట్టి..అప్పుడే చదివిన చిలిపి దయ్యం కద చెప్పాను
ఊ కొడుతూ వింటూ నా పక్కనే నిద్రపొయాడు
తీసుకెళ్ళి గదిలో పడుకొపెట్టా….
పక్క నిండా పుస్తకాలు పడేసి ఉన్నాయి… వాటిని మెల్లగా తీసి సర్ది టేబిల్ మీద పెడుతుండగా కనపడింది ఒక పుస్తకం…అధి రఘు డ్రాయింగ్ వేసుకునే పుస్తకం

మొదటి పేజీలో… ఒక బొమ్మ వేసి అమ్మమ్మ అని పెరు పెట్టాడు
రెండో పేజీలో …మూడు బొమ్మలు వేసి అమ్మ నాన్న మావయ్య అని పేర్లు పెట్టాడు
మూడో పేజీలో…. ఒక చిన్న పిల్లాడి బొమ్మ వేసి… సతీష్ అని రాసాడు
తన మనసులో చొటు ఉన్న వాళ్ళందరికి ఆ పుస్తకం లో కూడా చొటు ఇచ్చాడు కాబోలు…
ఏదో తెలియని తీయని అనుభూతి… పసి వాళ్ళ హృదయాలంత కల్మషం లేని చోటు మరెక్కడ….
ప్రపంచం లో పడ్డాక అదే హృదయం లో ఎక్కడ నుండి వస్తోంది ఆ కుటిలత్వం ….
అమాయకం గా ముద్దు గా నిద్ర పొతున్న రఘు ని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను
*******************************************************************************
అమ్మా నాన్న ని తీసుకురావటానికి గుంటూర్ వెళ్ళాను
అక్కడ మిగిలి ఉన్న సామాను అంతటి ని తీసుకోని బయలుదేరాము
దారిలో అమ్మ కి రఘు గురించి అంతా చెప్పాను
ఎమిటి రా..బాగా నచ్చినట్టు ఉన్నాడు ఆ కుర్రాడు నీకు
సొంత కొడుకు ముచ్చట్లు చెప్పినట్టు చెప్పుకుంటున్నావు మురిపెం గా అంటూ నవ్వేసింది..
అమ్మా వాడికి అమ్మమ్మ ఉంది కాని నాయనమ్మ లేదు.. ఇక నుంచి వాడు నిన్ను నాన్నమ్మ అంటాడు..సరేనా అన్నాను అమ్మ వైపు చూస్తూ….
దానికేం భాగ్యం రా…. అలానే పిలవమను…. నీ హడావిడి చుస్తుంటే ఆ పిల్లాడిని త్వరగ చుసెయ్యలనిపిస్తొంది కార్తీక్ అన్నది అమ్మ
మరే…ఔను రా…నాకు కుడా ..అన్నారు నాన్న గారు
మెల్లగా ఇంటికి చేరాము… సమాను అంతా దించగానే…అమ్మ రఘు ని చుస్తా అని తొందర పెట్టింది…
వెంటనే ఒక్క పరుగు న వాళ్ళ ఇంటికి వెళ్ళాను…
రఘు ఒక్కడే బైట కూర్చోని ఉన్నాడు….
నన్ను చుడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళు చుట్టేసాడు
వెంటనే ఎత్తుకొని ముద్ధు పెట్టి చాక్లెట్ ఇచ్చాను చేతికి…
వద్దు అంటూ తల ఉపాడు..కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతున్నాయి వాడికి
నాకేదో అనుమానం వచ్చి…అమ్మమ్మ ఏది అన్నాను
ఏమో తెలియదు…. తులసి ఆంటీ ఎమో అమ్మమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది అన్నాడు
గుండె జల్లు మన్నది ఒక్క నిమిషం
ఒక్క ఉదుటున పక్కింటి తులసి గారి ఇంట్లోకి వెళ్ళిపొయాను
నన్ను చుడగానే ఆవిడ కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యింది
వచ్చవా కార్తీక్…నీ ఫొనె నంబర్ కూడా లేకపొయింది నా దగ్గర
మొన్న రాత్రి నువ్వు అలా వెళ్ళగానే ,రఘు వాళ్ళ అమ్మమ్మకి దగ్గు బాగ ఎక్కువ అయ్యింధి… నువ్విచ్చిన దగ్గు మందు పోసాను..అయినా లాభం లేకపొయింది కార్తీక్.. నిద్ర లోనే ప్రాణాలు పొయాయి….
చుట్టాలంతా వచ్చారు…. ఏవరో వాళ్ళ చెల్లెలి గారి అబ్బయి అట..కొడుకు వరస కదా…తల కొరివి పెట్టాడు” అన్నారు
నా మెదడు మొద్దు బారి పొయింది….అసలేం జరిగిందో అర్ధం కాలేదు… ఇదంతా నా కలా అన్న మీమాంస
తేరుకొని రఘు కొసం వెతికాను…..
నా ఆత్రం చూస్తూ…కార్తీక్ రఘు నిన్న సాయంత్రం వాళ్ళ అమ్మమ్మ ని తీసుకువెళ్ళినప్పటి నుంచి ఏం తినలేదు…ఒకటే ఏడుపు …నీ కొసం..
కార్తీక్…ఆవిడ మొన్న రాత్రి నేను మందు వేయటానికి వెళ్ళినప్పుడే నీకు చెప్పమని నాలుగు మాటలు చెప్పారు అన్నారు
ఏంటి అనట్టు చెమ్మర్చిన కళ్ళతో ఆవిడ వైపు చూసాను
నా చూపులో ప్రశ్న అర్ధం అయ్యినట్టు గా…. “తనకి ఏదన్న అయితే , నీకు ముందు గా చెప్పినట్టు, రఘు ని వాళ్ళకు తెలిసిన అనాధ ఆశ్రమంలో చేర్చమన్నారు..అక్కడైతే పిల్లల్ని బాగా చూస్తారు అట…. అడ్రెస్స్ వివరాలు డైరీలో ఉన్నాయి అన్నారు” అని చెప్పరు తులసి గారు
బైటకు వెళ్ళి చూసాను… గులాబి కుండీలో మొక్కకి నీరు పొస్తూ బాల్కనీలో నిల్చున్నడు రఘు….
దగ్గరకు వెళ్ళి వాడి తల మీద చేయి వేసాను…
నా వైపు చుస్తూ… “మొక్కలకి నీరు పొస్తే… హాయిగా తాగేసి..నాలా పచ్చగా ఉండండి అని దీవిస్తాయి అట” అమ్మమ్మ చెప్పింది అంకుల్ అన్నాడు….
గుండెను మెలిపెడితే ఇలాంటి నొప్పే ఉంటుందేమో అనిపించింది
********************************************************************************
కార్తీక్ నువ్వు అలొచించే ఈ నిర్ణయం తీసుకున్నవా అని అడిగింది అమ్మ
అమ్మా నేను అలోచించకుండా ఏ పని చేయను అని నీకు తెలుసు…తెలిసి మరీ అడగటంలో ఎంటి నీ ఉద్దేశ్యం అన్నాను విసుకుగా
అది కాదు రా… రేపు నీకు పెళ్ళి అవుతుంది…ఆ వచ్చే అమ్మాయి నీ ఈ నిర్ణయాన్ని సమర్ధించేది కాదనుకో…ఎంటి పరిస్థితి అన్నది దిగులు గా
పక్కనే ఉన్న నాన్నగారు, “ అర్ధం చెసుకునేదే వస్తుందిలే పద్మా… ఊరికే దిగులు పడకు…అయినా వాడిని మనం ఏలా పెంచామో వాడు అలానే ప్రవర్తిస్తున్నాడు….. సుమతీ శతకాలు వేమన శతకాలు వల్లె వేయించావు నువ్వు…. వివేకానందుడి జీవిన ప్రయణాన్ని చదివి వినిపించాను నేను… మరి అవి అన్నీ గాలి లోకి వదిలేయలేడు కదా…. వాడు ఈ నిర్ణయం తీసుకొవటం నాకు కూడా చాలా సంతోషం గా ఉంది…ఇక నువ్వు వేరే ఎమీ ఆలోచించకుండా, వెళ్ళి రఘు కి అన్నం పెట్టు” అన్నారు
నాన్న దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను… “ఏమిటి రా” అంటూ నా చేయి పట్టుకున్నారు…. ఏందుకో తెలియని బాధ పెల్లుబికింది…నాన్నా ని గట్టిగా పట్టుకున్నాను…. తండ్రి స్పర్శలో ఉన్న ధైర్యం కొండంత ఊరటనిచ్చింది ఒక్క సారిగా
నాన్న గారు…. ఏప్పుడో వయసు అయిపొయాక ఎదో చెయ్యాలి..ఒక ఆశ్రమం పెట్టాలి…పసి వారికి …అనాధలకి చేయుతని ఇవ్వాలి అని ఎంతో అనుకునేవాడిని….
ఎప్పుడో ఎందుకు…ఇప్పుడే ఎందుకు కాదు అనిపిస్తూ ఉండేది అప్పుడప్పుడు… చుస్తూ చుస్తూ నా భాద్యతని విస్మరించలేకపొయాను నాన్న గారు…
అందుకే మీ అభిప్రాయన్ని తెలుసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను….తప్పైతే క్షమించండి
రఘు మీద జాలితో నేను ఈ నిర్ణయం తీసుకొలేదు నాన్న గారు… నా స్వార్ధంతో తీసుకున్న నిర్ణయం ఇది…
వాడి పసితనపు నవ్వులో ఉన్న నిర్మలత్వం… వాడి చిన్న మనసులో ఉన్న ప్రేమ…వాడి చిలకపలుకుల్లో ఉన్న తీయదనం….ఇవన్నీ తనివితీరా ఆశ్వాదించేయాలన్న స్వార్ధం…అంతే….
“కార్తీక్…. నిర్ణయం సరి అయ్యింది అనుకునప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు రా,అందులో తప్పు ఏమి లేదు కాని…లేచి వెళ్ళి అన్నం తిని పడుకో…. రేపు పొద్దున్నే పది గంటలకే మహుర్తం.. ఆ దత్తత స్వీకారం ఎదో అయ్యాక అప్పుడు తీరిగ్గా నీ కొడుకుతో పాటు కూర్చోని మరీ కబుర్లు చెప్పుకుందాం సరేనా అంటూ చల్లగా నా బుగ్గ ని తాకింది ఆయన చేయి “
ఇదే ఊరట ఇదే స్తైర్యం నేను కూడా రఘు కి అందించకలిగితే…. నాన్న నాకు నేర్పిన పాటాలు..చూపిన దారి రఘు కి నేను చుపకలిగితే … వాడు కూడా ప్రపంచాగ్నికి సమిధ కాగలడేమో అనిపించింది
లేచి బెడ్రూం లోకి వెళ్ళాను… రఘు మంచం మీద కూర్చోని బొమ్మలు వేస్తున్నాడు…..
ఈ సారి ఆ బొమ్మ కి కార్తీక్ అంకుల్ అని పేరు పెట్టాడు
వాడి మనసులో స్థానం సంపాదించిన ఆనందంలో వాడిని గట్టిగా ముద్దాడాను…
నవ్వుతూ తిరిగి నాకు ముద్దు పెట్టాడు……
తొలకరి జల్లులో ఛిగురాకు స్పర్శ అంతటి హాయి

14 comments:

Samata said...

Chaaala bavundi Srujana, kallalo neellu vachesaayi...good..waiting for more stories from you..

Mahi said...

Hi akka... story chala bagundi.. chaduvuthu edchesanu nenu..heart touching story..
story ki thaggatlu ga undi title kuda..

Unknown said...

chala chala bavundi...chaduvtoo unte story lo involve ayipoyi edupu vachestundi...good work..keep writing..

Anonymous said...

చాలా బావుంది. పాత్ర పరిచయంలో వ్యైవిధ్యం, depth ఉంటే బావుంటుంది. Narrative also first person ninchi verega try chesthe baavuntundi emo, just a thought.

సుజ్జి said...

aenta baaga raasarandi..

Anonymous said...

awesome ga vundhi andi.
nijama ga kallalo neelu tirighayi chaduvutuntae,
chala chala baga rasaru.
heart-touchng vundhi.
thanks fr sharing ur story.
bubyeeeeeeeee.
waiting fr some more lyk dis

Anonymous said...

Excellent Srujana.. Touching.. Very touching.. Gunde ni taakitey ilaaney vuntundemo.. aa feeling..(sorry..copy chesa.. kaani feeling nijamey) Thanks for sharing.. :)

HiMa said...

idi story naa?? nijam ga jarigindi emo anukunnanu

awesome!!

Raghavendra said...

Indulo konni sanghatanalu nijamga jariginiva leka mee oohaajanithaalena?

ULay said...

Chala bagundi ani chepte takkuve ....Nenu emotional ayya

Ravi N said...

Awesome story Srujana. Really really good. Very touching.

Unknown said...

Awesome.... Great feel

RLK said...

Beautiful narration. Katha tho prayanam cheyincharu, kaadu Karthik to prayanam cheyincharu, kademo prati patra tho nadipicharu.

Prathima Ramachandruni said...

Chala chala chala bagundi👏